Sunday, 14 January 2018

రిషబ్‌ పంత్‌ రికార్డు సెంచరీ

న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ టీ 20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీ 20  ఫార్మాట్‌లో వేగవంతమైన సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా రిషబ్‌ రికార్డు సృష్టించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ 20 టోర్నీలో భాగంగా హిమచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 32 బంతుల్లో సెంచరీ సాధించి సత్తాచాటాడు. ఫలితంగా టీ 20ల్లో వేగవంతంగా ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ సాధించడమే ఇప్పటి వరకూ పొట్టి ఫార్మాట్లో భారత్ తరపున వేగవంతమైన శతకం. ఓవరాల్‌గా టీ20ల్లో రెండో వేగవంతమైన శతకం చేసిన ఆటగాడు రిషబ్ పంత్ నిలిచాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ గేల్ పేరిట ఉంది. 2013లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ పుణే వారియర్స్‌పై 30 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ మొత్తంగా 12 సిక్సర్లు, 8 ఫోర్లతో  116 పరుగులు చేశాడు. హిమాచల్‌ ప్రదేశ్‌ విసిరిన 144 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగగా, ఓపెనర్‌ రిషబ్‌ చెలరేగి ఆడాడు. అతనికి జతగా గౌతం గంభీర్‌(30 నాటౌట్‌) నుంచి సహకారం లభించడంతో ఢిల్లీ 11.4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

No comments:

Post a Comment