Thursday, 18 January 2018

రెండు టీఎంసీలకు ఎసరు? కేసీ కాలువ నీటి మళ్లింపు లేనట్లే హెచ్చెల్సీ ఇండెంట్‌తో బట్టబయలు నోరుమెదపని జిల్లా ప్రజాప్రతినిధులు న్యూస్‌టుడే, అనంతపురం (శ్రీనివాస్‌నగర్)


కర్నూలు-కడప కాలువ (కేసీ) వాటాలో నీటి మళ్లింపులో (డైవర్షన్‌) తప్పనిసరిగా మనకు దక్కాల్సిన జలాలపై ఈ దఫా ఆశలు వదులుకొనే పరిస్థితి తలెత్తింది. ఒక్కసారిగా హెచ్చెల్సీ వాటా ఇండెంట్‌ను సగానికి సగం తగ్గించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కేసీ కెనాల్‌ వాటాలో మన జిల్లాకు 2 టీఎంసీలు రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆ జలాలు జిల్లాకు చేరే అవకాశాలు దాదాపు లేనట్లే. ఇదే విషయమై రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ సూచన ప్రాయంగా జిల్లా అధికారులకు పరోక్ష సంకేతాలు పంపినట్లు తెలిసింది. ఈవిషయం ప్రజాప్రతినిధులకు తెలిసినా ఎవరూ నోరు మెదపలేదు. రెండు టీఎంసీలు అంటే 20 వేల ఎకరాల ఆయకట్టు సాగుకు సరిపడే నీరు అన్నమాట. ఇంతటి ప్రాధాన్య అంశాన్ని ప్రజాప్రతినిధులు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. సరికదా... అటు హెచ్చెల్సీ, ఇటు హంద్రీనీవా కాలువల ద్వారా జిల్లాకు ఎన్ని టీఎంసీలు వచ్చాయి? ఏయే జలాశయానికి, కాలువలకు ఎన్నెన్ని టీఎంసీలు.. క్యూసెక్కుల నీరు ఇస్తున్నారనే కనీస వివరాలను కూడా ఆరా తీయడంలేదు. ఇదే అవకాశంగా తీసుకున్న రాష్ట్ర అధికారులు ఏకపక్షంగా కేసీ కాలువ నీటిని మన హెచ్చెల్సీకి మళ్లించడానికి సుముఖత చూపలేదు. ఈనెల మొదటి నుంచి తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్‌, సుంకేసుల జలాశయాలకు నీరు విడుదల చేస్తున్నారు. రోజూ 2 వేల క్యూసెక్కుల ప్రకారం నదిలో వదిలేశారు. ఈ ప్రభావం హెచ్చెల్సీపై పడింది.
కేసీ వాటా 5.3 టీఎంసీలు...
తుంగభద్ర జలాశయం మండలి (టీబీ) ప్రొరేట్‌ ప్రకారం హెచ్చెల్సీకి 17.476 టీఎంసీలు రావాలి. ఇప్పటికే 16.258 టీఎంసీలు విడుదల చేశారు. ఏపీ సరిహద్దుకు 14.971 టీఎంసీలు చేరాయి. ఇదే క్రమంలోనే కేసీ కాలువ వాటాగా 5.3 టీఎంసీలు రావాలి. ఇందులో మన జిల్లాకు 2 టీఎంసీలు కేటాయించాల్సి ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను కేసీ కాలువకు మళ్లించడం... తుంగభద్ర నుంచి కేసీ కాలువకు వెళ్లాల్సిన వాటాలో కొన్ని టీఎంసీలు మన హెచ్చెల్సీకి కేటాయించేలా గతంలో ప్రభుత్వం జీవో నెం.3ని 4.1.2006న జారీ చేసింది. ఈ ప్రకారమే ఈ ఏడాది కనీసం 2 టీఎంసీలు జిల్లాకు చేరాలి. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 31.080 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఈ నీరు ఫిబ్రవరి రెండో వారానికి పూర్తి అవుతుంది. రోజూ జలాశయం నుంచి వివిధ కాలువలకు 10 వేలకుపైగా క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అంటే... రోజూ రమారమి ఒక టీఎంసీ బయటకు వెళ్తున్నట్లే. ఈ ప్రకారం లెక్కిస్తే నెలకు మించి నీరు రావు. ఈలోపు హెచ్చెల్సీ వాటాతోపాటు కేసీ నీరు తీసుకోవాలంటే రోజూ కనీసం 2 వేల క్యూసెక్కులు తీసుకోవాలి. అయితే ఈనెల 15 వరకు 1,500 క్యూసెక్కుల ప్రకారం వచ్చేవి. మంగళవారం (16వ తేదీ) నుంచి ఆ 1,500 క్యూసెక్కుల నుంచి 750 క్యూసెక్కులకు తగ్గించారు. దీన్నిబట్టి ప్రస్తుతం మనకు రావాల్సిన 1.218 టీఎంసీలు మాత్రమే హెచ్చెల్సీ వాటా జలాలు మిగిలి ఉన్నాయి. వీటిని ఫిబ్రవరి పదో తేదీ వరకు తీసుకోవడానికి సరిపోతాయి.
ప్రతి ఏటా వచ్చాయి...
హెచ్చెల్సీ వాటాతోపాటు కేసీ కాలువ నీరు కూడా ప్రతి ఏటా మనకు దక్కింది. 2012-13లో 3.3 టీఎంసీలు, 2013-14లో 4.5 టీఎంసీలు, 2014-15లో 4 టీఎంసీలు, 2015-16లో 1.003 టీఎంసీలు, 2016-17లో 1.177 టీఎంసీల ప్రకారం జిల్లాకు చేరాయి. ఈ దఫా ప్రొరేట్‌ ప్రకారం 5.3 టీఎంసీల్లో మన జిల్లాకు 2 టీఎంసీలు దక్కాలి. తాజా సంకేతాల ప్రకారం ఆ జలాలు రానట్లే. హంద్రీనీవా ద్వారా ఆ వాటాను భర్తీ చేస్తామని రాష్ట్ర అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈదఫా ఇప్పటికే హంద్రీనీవా నీరు 14 టీఎంసీలు దాకా జిల్లాకు చేరింది. ఈ కాలువ ద్వారా అత్యధికంగా ఈదఫా ఎక్కువ వచ్చినట్లే. 2013-14 నుంచి కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయి. తొలి ఏడాదిలో 3.412 టీఎంసీలు, 2014-15లో 8.638 టీఎంసీలు, 2015-16లో 2.361 టీఎంసీలు, గతేడాది 11.889 టీఎంసీలు ప్రకారం వచ్చాయి. ప్రస్తుతం 14 టీఎంసీలు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నారు. ఈ జలాలు మార్చి ఆఖరు వరకు జిల్లాకు వస్తాయని ఆశలు రేకెత్తిస్తున్నారు. అందుకే కేసీ కాలువ మళ్లింపు నీటిని నదికి వదిలేశారనే భావన వ్యక్తమౌతోంది. నదికి వదిలేయడం ద్వారా ఆర్డీఎస్‌, సుంకేసుల బ్యారేజీ పరివాహక ప్రాంతాల భూగర్భ జలాలు పెరగడానికే అనే వాదన తెర మీదకు తీసుకొచ్చారు. ఏదిఏమైనా ఈదఫా కేసీ కాలువ వాటాలో మనకు దక్కాల్సిన 2 టీఎంసీలు రానట్లే అని స్పష్టం అవుతోంది.

No comments:

Post a Comment