హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెదేపా-బీజేపీ నేతల వివాదంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. జడ్పీ చైర్మన్ బాపిరాజు, ఇతర తెదేపా నేతల వ్యాఖ్యలపై ఆయన ఆరా తీశారు. ఈ ఉదయం తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబుకు పార్టీ నేతలు కొందరు ఈ వివాదం అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వివాదంపై విచారణకు మంత్రలు పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, పిఠాపురం ఎమ్మెల్యే వర్మతో కమిటీ ఏర్పాటు చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని నేతలను హెచ్చరించారు. బాపిరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఇప్పటికే బాపిరాజు అనేకసార్లు క్రమశిక్షణ ఉల్లంఘించారని ఆయన మండిపడ్డారు. బాపిరాజు వ్యవహారశైలి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.
No comments:
Post a Comment