Monday, 15 January 2018

రాజకీయాల్లో పెను సంచలనం... ఎన్నికల ఖర్చుల కోసం వ్యాపారిని కిడ్నాప్ చేసిన పార్టీ మహిళా అధ్యక్షురాలు!

  • బెంగళూరు: కర్ణాటకలో వెలుగుచూసిన ఓ కిడ్నాప్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఏడాది కర్ణాటకలో జరగునున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఓ పార్టీ మహిళా నేత ఎన్నికల ఖర్చుల కోసం కిడ్నాప్‌కు తెరతీసింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు గుంజాలని ప్రయత్నించింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. పోలీసుల కథనం ప్రకారం..
     
    ఈ ఏడాది కర్ణాటకలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్ మహిళా అధ్యక్షురాలు అర్షియా అలీ (37) బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికలంటే మాటలతో డబ్బులతో వ్యవహారం. కోట్ల రూపాయలతో పని. అంతడబ్బు తన వద్ద లేకపోవడంతో ఎలాగైనా సంపాదించాలని పథకం వేశారు. యలహంక మాజీ నగర సభ్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మల్లికార్జునప్ప అలియాస్ మల్లన్నను కిడ్నాప్ చేసి అనుకున్న మొత్తాన్ని సంపాదించాలని ప్లాన్ రెడీ చేశారు. ఇందుకోసం కాంతరాజ్ గౌడ(39), రేణుక ప్రసాద్(41), డ్రైవర్ ప్రదీప్‌ అలియాస్ ప్రతీష్(32) లతో ఓ టీమ్‌గా ఏర్పడ్డారు. జనవరి 11న కొగిలు క్రాస్ వద్ద ఉన్న పార్క్‌కు ఉదయపు నడకకు వెళ్లిన మల్లికార్జునప్పను మారణాయుధాలు చూపించి కిడ్నాప్ చేశారు. కారులో ఎక్కించుకుని కోలార్ సమీపంలోని బాగేపల్లి తీసుకెళ్లారు. అక్కడ ఓ గదిలో మల్లన్నను బంధించి డాక్టర్ అయిన అతని కుమారుడు రవికుమార్‌కు ఫోన్ చేసి రూ. 100 కోట్లు ఇవ్వాలని, లేదంటే తండ్రిని చంపేస్తామని బెదిరించారు. కిడ్నాపర్ల ఫోన్‌తో హతాశుడైన ఆయన తండ్రికి హాని తలపెట్టవద్దని, తన వద్ద అంత డబ్బు లేదని చెప్పి బతిమాలడంతో చివరికి రూ.60 లక్షలకు ఒప్పందం కుదిరింది. అదే రోజు కిడ్నాపర్లకు ఆ మొత్తం ముట్టజెప్పి తండ్రిని విడిపించుకున్నారు. ఇంటికి వస్తూవస్తూ మార్గమధ్యంలో కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
     
    రంగంలోకి దిగిన యలహంక డీసీపీ గిరీశ్ నేతృత్వంలోని బృందం మల్లికార్జున కిడ్నాప్‌నకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి సీసీటీవీ ఫుటేజీలను సేకరించింది. అనంతరం ఫోన్ నంబరు ఆధారంగా హొరమావి ప్రాంతంలో కిడ్నాపర్ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు దాడి చేసి డ్రైవర్ ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కోటి రూపాయల నగదు, నగలు, తుపాకి, తూటాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడీ కిడ్నాప్ వ్యవహారం కర్ణాటకలోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

No comments:

Post a Comment