తాడిపత్రి(అనంతపురం జిల్లా): అత్యంత ఉత్సుకత, ఉత్కంటతో జరిగిన పందుల పోటీలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. పట్టణంలోని టెలిఫోన్ ఎక్ఛేంజి వద్ద ఉన్న మైదానంలో ఆదివారం జరిగిన పందుల పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పందులు తరలివచ్చాయి. వాటిలో తాడిపత్రి, గిద్దలూరు, పొద్దుటూరు, పెద్దపప్పూరు, కడప, బేతంచర్ల, డోన్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, తెలంగాణలోని గద్వాల్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున పందులు పోటీలకు హాజరయ్యాయి. ఈ పోటీలకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గతేడాది కోడి పందేలు, పందుల పోటీలు, ఇతర జంతువుల అందాల పోటీలను ఎమ్మెల్యే ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది కోడి పందేలకు నిషేధం ఉండడంతో వాటి జోలికెళ్లలేదు. పందుల పోటీలకు హాజరై దాదాపు గంట పాటు తిలకించారు. పట్టణంలో పందుల పోటీలు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకున్న తాడిపత్రి పట్టణ, పుట్లూరు, పెద్దపప్పూరు, యల్లనూరు, యాడికి మండలాలకు చెందిన వారే కాకుండా సరిహద్దు జిల్లాలైన కడప, కర్నూలు జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. పోటీలను ఆద్యంతం ఎంతో ఆసక్తిగా తిలకించారు.
పందుల పోటీలకూ తప్పని బెట్టింగ్
పందుల పోటీల సందర్భంగా పెద్దఎత్తున బెట్టింగ్‌లు జరిగాయి. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉన్నంతవరకు నిశ్శబ్దంగా ఉన్న బెట్టింగ్‌రాయుళ్లు ఆయన వెళ్లిన వెంటనే బెట్టింగ్‌లకు తెరలేపారు. బెట్టింగుల్లో వివిధ ప్రాంతాల నుంచి పోటీల కోసం పందులను తీసుకొచ్చిన పోటీదారులతో పాటు వారివెంట వచ్చిన మద్దతుదారులు, ఆయా ప్రాంతాల నుంచి పోటీలు తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులు బెట్టింగులు కట్టడంలో నిమగ్నమయ్యారు. పెద్దఎత్తున బెట్టింగులు జరగడం కనిపించింది. బెట్టింగుల్లో వేలాది రూపాయలు చేతులు మారాయి.

No comments:
Post a Comment