Monday, 22 January 2018

ప్రశ్న ఇప్పుడొక ద్రోహం.. దీనిమీదే సినిమా తీస్తా: కత్తి మహేష్

నిమ్మళంగా కనిపిస్తారు గానీ ఆయన పెదవి విప్పితే, వొర లోంచి సర్రున కత్తి దూసినట్టే మాట బయటకు వస్తుంది. సోషల్‌ మీడియాలో ఆయన సినిమా విమర్శలు కూడా అంతే, ఎడాపెడా చెరిగేయడమే. ఈ ధోరణే ఆయనను వివాదాలకు కేంద్రం చేసింది. వార్తల్లోని వ్యక్తిగా మార్చింది. ఆయన కత్తి మహేష్‌. మన చిత్తూరు జిల్లా వాసి. ఎర్రావారిపాళెం మండలం యలమంద ఆయన ఊరు. హైదరాబాద్‌‌లో స్థిరపడ్డ కత్తి మహేష్‌, పండక్కి సొంత ఊరు వచ్చారు. ఈ సందర్భంగా వర్తమాన సంగతులను ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు.
 
కత్తి మహేష్‌ పుట్టిన ఊరు ఎల్లమంద. ఆయన తండ్రి కత్తి ఓబులేశు ప్రస్తుతం ఊళ్లోనే ఉన్నారు. అమ్మ కత్తి సరోజమ్మ ఏడాదిన్నర కిందట మరణించారు. మహేష్‌ అన్న కత్తి రవికుమార్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నారు. చెల్లెలు వాణిశ్రీ సికిందరాబాద్‌లో న్యూట్రిషనిస్ట్‌గా ఉన్నారు. మహేష్‌ భార్య సొనాలిది కోల్‌కత్తా. వీరిది ఇంటర్నెట్‌ ప్రేమ. ఆమె లక్‌నవ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉన్నారు. ఎనిమిదేళ్ల కొడుకు తల్లి దగ్గరే ఉన్నాడు. మహేష్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌లో ఎంఏ చేశారు. సినిమా రంగంలో స్థిరపడ్డారు.
 
పీలేరు టౌన్‌(చిత్తూరు జిల్లా): దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రస్తుతం ప్రజాస్వామిక వాతావరణం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దల్నీ, రాజకీయ నేతల్నీ ప్రశ్నించేవారిని అణిచివేసే పరిస్థితి నెలకొని ఉంది. ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్ని సామాన్య ప్రజలల్లోకి తీసుకువెళ్ళడం కోసం ఒక వ్యంగ్య చిత్రం నిర్మించబోతున్నాను. ఫిబ్రవరిలో సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తాం. ప్రశ్నించడం వల్లే నేను ఈ రోజు ఉభయ తెలుగు రాష్ర్టాలకూ సుపరిచితుడయ్యాను. సినిమా, టీవీ రంగంలో ఉన్నందువల్లే ప్రశ్నించడానికీ, నా గొంతును వినిపించడానికీ ఒక వేదిక దొరికింది. వేదిక దొరకని వారు ఎందరో దేశంలో ఉన్నారు. వారందరికీ నేను గొంతుకనవుతున్నాను.
 
అభివృద్ధిలో అసమానతలు:
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలోని అసమానతని నేను ప్రశ్నిస్తున్నాను. కేవలం హైదరాబాదు పరిసర ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేసి ఇది వరకే ఒకసారి తప్పు చేశామని ఒప్పుకుంటున్న పాలకులు మళ్ళీ అవే తప్పుల్ని చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిష్టాత్మక సంస్థల్ని అమరావతి చుట్టూ కేంద్రీకృతం చేసి మిగతా ప్రాంతాల్ని పట్టించుకోవడం లేదు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే అన్ని విధాలా వెనుకబడ్డ ఈ ప్రాంతం అభివృద్ధికి ఊతం లభిస్తుంది.
 
నా వెనుక ఎవరూ లేరు:
కొంత మంది ప్రచారం చేస్తున్నట్లు నా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. నాకు ఎవరి మద్దతూ లేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనా లేదు. భవిష్యత్తులో నా సిద్ధాంతాలు నచ్చి ఆహ్వానించే రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా ఉండడానికి మాత్రం ఇష్టపడతాను. టీవీ రంగంలో ఉన్నందువల్లే బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనే అవకాశం లభించింది. ఎవరి సిఫార్సు లేదు. బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న అందరితో ఇప్పటికీ నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. మేమందరం ఒక వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిరోజూ అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటాం.
 
నేనూ నా సినిమా:
నేను ఇప్పటిదాకా రెండు షార్టు ఫిల్మ్స్‌, మూడు సినిమాలు తీశాను. బాలగంగాధర్‌ తిలక్‌ రచన ‘ఊరి చివర ఇల్లు’ స్ఫూర్తితో ‘ఎడారి వర్షం’ పేరుతో మొదటి షార్ట్‌ ఫిలిం తీశాను. ఒక వైద్యుడు తన తల్లిని వెతుక్కుంటూ వెళ్లే కథాంశంతో ‘కృతజ్ఞత’ పేరుతో ఇంకో షార్ట్‌ ఫిలిం తీశాను. క్రౌడ్‌ ఫండింగ్‌తో 12 మంది నిర్మాతలతో కలిసి ‘పెసరట్టు’ అనే సినిమా తీశాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో 62 థియేటర్లలో ప్రదర్శింపబడి ఆ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. చిన్నారుల్లో అంతరించిపోతున్న సహజ లక్షణాలు, వాటి పర్యవసనాలను వివరిస్తూ ‘ఎగిసే తారాజువ్వలు’ అనే సినిమా తీశాను.
 
2017 నవంబర్‌ 14న రిలీజైన ఆ సినిమాకు ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అఫిషియల్‌ ఎంట్రీ లభించింది. నేను సహ రచయితగా వ్యవహరించిన ‘మిణుగురులు’ అనే సినిమాకు మంచి అభినందనలు వచ్చాయి. ఆ సినిమా స్ర్కిప్టును ఆస్కార్‌ అకాడమీ లైబ్రరీలో శాశ్వతంగా పొందుపరిచారు. ఈ ఘనత దక్కిన మొట్టమొదటి తెలుగు సినిమా ‘మిణుగురులు’. ‘హృదయకాలేయం’, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాల్లో నేను నటించాను. తెలుగు సినిమా రంగంలో విమర్శకుల కొరత ఉంది. అందుకే ఆ రంగంలోకి ప్రవేశించాను. ఇకపై కూడా విమర్శకుడిగా కొనసాగుతాను. వివాదాలు వెంటాడుతున్నా సినీ పరిశ్రమలో నాకు మంచి మిత్రులున్నారు.
 
అది అమ్మ మరణ దు:ఖం:
ఒక టీవీ చర్చలో మా అమ్మ గురించి అడగగానే సమాధానం చెప్పకుండా నేను ఎందకు లేచివెళ్లిపోయానని చాలా మంది అడుగుతున్నారు. మా అమ్మ గురించి దర్శకుడు వివేక్‌కృష్ణ అడిగిన విధానం నాకు నచ్చలేదు. కేన్సర్‌ బారిన పడి కిమోథెరపీతో ఎముకల గూడులా మారి మా అమ్మ చనిపోయింది. అది గుర్తొచ్చి నాకు మాట రాలేదు. వివేక్‌కృష్ణను వారించాల్సిన యాంకర్‌ సైతం అతడినే సమర్థిస్తూ మాట్లాడడంతో నేను అక్కడ ఉండడం ఇష్టం లేక వచ్చేశాను.

No comments:

Post a Comment